||సుందరకాండ ||

||పదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
తత్ర దివ్యోపమంముఖ్యం స్ఫాటికం రత్నభూషితమ్|
అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనమ్||1||
స||తత్ర అవేక్షమాణో హనుమాన్ స్ఫాటికం రత్న భూషితమ్ దివ్యోపమమ్ ముఖ్యం శయనాసనమ్ దదర్శ||
సీతాన్వేషణలోనున్న హనుమంతుడు అప్పుడు స్ఫటిక రత్న విభూషితమైన శయనాసనమును చూచెను.

సుందరకాండ.
అథ దశమస్సర్గః

సీతాన్వేషణలోనున్న హనుమంతుడు అప్పుడు ఆ శయనాగారములో స్ఫటిక రత్న విభూషితమైన ఒక శయనాసనమును చూచెను.

ఆ శయనాసనము బంగారము దంతముల నగిషీలతోనూ అమూల్యమైన వైఢూర్యమణి ఖచితములై అనేక వర్ణములతో గల అనేక మంచి ఆసనములతో ఉండెను

ఆ ఉత్తమమైన శయనాసనము బంగారము తో నిర్మితమైనది. కాంతి తో వెలుగుచున్నది. అశోక పుష్పమాలలతో అలంకరింపబడినది.

ఆ శయనాశనముకు ఒక పక్కన అందమైన పుష్పమాలలతో అలంకరింపబడిన తారలలో చంద్రుడిలాగా వున్న తెల్లని ఛత్రము వుంది.

ఆ శయనాసనమును వ్యాలవ్యజనము చేతిలో పట్టుకొని స్త్రీలు వింజామరలు వీస్తున్నారు.

అక్కడ అనేక గంధములతో కూడిన ధూపధూమము సర్వత్ర వ్యాపించి యున్నది.

ఆ శయనాసనము మెత్తని పరుపులతో మెత్తని గొర్రె చర్మములతో కప్పబడినది. మంచి మాలలతో శోభాయమానముగా అలంకరింపబడినది. .

ఆ శయనాసనము మీద పడుకుని ఉన్న మహానుభావుడు రాక్షసాధిపతి రావణుడు.

ఆ రావణాసురుడు మేఘములవలెనున్నవాడు. శ్రేష్టమైన కుండలములు ధరించిన వాడు, ఎఱ్ఱని కళ్ళు గలవాడు, ఎఱ్ఱని వస్త్రములు ధరించినవాడు, మహాబాహువులకల వాడు. అతడు సుగంధముకల ఎఱ్ఱని చందనముతో అలేపనము చేసుకుని , దివ్యమైన ఆభరణములతో భూషితుడై, ఆకాశములో సంధ్యా సమయములో ఎఱ్ఱని రంగుతో మఱుపు తీగలతో కూడుకున్న మేఘము వలె నున్న సురూపము గల కామరూపి అగు రావణుడు, వృక్షములు వనములతో నిండిన పర్వతరాజములాగా నిద్రిస్తున్నాడు.

రాత్రి అంతా ఆడిన ఆటలతో అలసిపోయిన , తాగి అలసిపోయిన , మంచి ఆభరణములతో భూషితుడైన, రాక్షసకన్యలకు ప్రియుడైన, రాక్షసులకు సుఖము కలిగించు రాక్షాసధిపతి అగు రావణుడు ప్రకాశించుచూ నిద్రలో ఉన్న వీరుడు.

ఆ వానరర్షభుడగు హనుమంతుడు పాము బుసలవలే వున్న ఉచ్చ్వాస నిశ్వాసములు చేయుచున్న రావణుని సమీపించి, భయముతో ఉద్విగ్నుడై వెనుకడుగు వేశెను. ఆ మహాకపి ఇంకొక మెట్లపైకి ఎక్కి, ఆ నిద్రిస్తున్న రాక్షస శార్దూలమగు రావణుని దూరమునుంచి చూడసాగెను.

రాక్షసేంద్రుడు పడుకుని ఉన్న ఆ శయనాసనము, మదముకారుచూ ఏనుగు శయినించిన ప్రస్రవణ పర్వతము వలె ఒప్పారెను. బంగారపు బాహుపురలతో, ఐరావతము తో పోరాడిన మచ్చలతో , వజ్రాయుధము యొక్క గాట్ల మచ్చలతో . విష్ణుచక్రము వలన కలిగిన మచ్చలతో వున్న ఆ రాక్షసేంద్రుని బాహువులు, రెండు ఇంద్రుని ధ్వజములలా ఉన్నాయి. సమసుందరములైన మూపు గలవై, బలిసివున్న ఆ రాక్షసాధిపతి భుజములు, శుభలక్షణములు కల వేళ్ళతోనూ గోళ్ళతోనూ అరచేతులతోనూ వున్నాయి. ఆ భుజములు పరిఘాకారములో ఏనుగుయొక్కతోడము వలెనున్న ఇదు తలలు కల పాములలాగా కనిపిస్తున్నాయి.

ఆ రావణుని భుజములు మంచి గంధములతో శశకముయొక్క రక్తములాంటి ఎర్రని చందనముతో పూయబడినవి. ఉత్తమమైన స్త్రీల చేత మర్దింపబడినవి. ఉత్తమమైన సుగంధములచేత పూయబడినవి. యక్షకిన్నర గంధర్వులను అ భుజములు విలపించినవి. మందరపర్వతములో కోపించి నిద్రుంచుచున్న సర్పములు లావున్న, శయనము మీద నిద్రించుచువున్న రావణుని బాహువులను హనుమంతుడు తిలకించెను. పర్వతములా వున్న ఆ రాక్షసేశ్వరుడు ఆ రెండు భుజములతో రెక్కలువున్న మందరపర్వతము వలె విరాజిల్లెను.

నిద్రిస్తున్న ఆ రాక్షససింహుని మహాముఖమునుంచి చూత పున్నాగ పు సువాసనలతోకలిసి, వకుళ వాసనలతో కలిసి, మృష్టాన్నపుభోజనముల వాసనలతో కలిసి , త్రాగిన పానముల సుగంధములతో కలసి వస్తున్న ఉచ్చ్వాస నిశ్వాసములు ఆ గృహమును నింపుతున్నాయి.

ముత్యములతో మణులతో పొదగబడి ప్రక్కన పెట్టబడిన బంగారు కిరీటముతో, కుండలముల కాంతితో విరాజిల్లుచున్న రావణుడు , రక్తచందనము చే అలకబడిన ముత్యాలహారముతో ఒప్పుతున్న బలిష్ఠము విశాలము అయిన వక్షస్థలముతో విరాజిల్లుచున్న రావణుడు, తెల్లని ఉత్తరీయముతో శ్రేష్టమైన పీతాంబరము ధరించి ఉన్నాడు.

ఆ రావణుడు ఎఱ్ఱని కళ్ళతో, బుసలుకొట్టె మహాసర్పములా ఉచ్చాసనిశ్వాసములతో, మహత్తరమైన గంగానదిమధ్యలో నిద్రుస్తున్న ఏనుగు వలె నుండెను. నాలుగు వేపులా బంగారు దీపముల చేత ప్రకాశింప బడుతూ ఆ రావణుడు మెరపుల సమూహములతో ప్రకాశించుచున్న మేఘమువలె ప్రకాశించుచుండెను.

ఆ వానరుడు ఆ రాక్షసాధిపతి గృహములో ఆ మహాత్ముని పాదముల వద్దనున్నరావణుని ప్రియమైన భార్యలు చూసెను. ఆ రావణుని భార్యలు , ప్రకాశించుచున్న చంద్రుని ముఖముకలవారు , అందమైన కుండలములు ధరించినవారు, వాడిపోని పుష్పమాలలు ధరించినవారు.

ఆ రావణుని భార్యలలో నృత్య వాద్యములలో ప్రవీణులు, అందమైన ఆభరణములను ధరించి రావణుని భుజముపై శయినిస్తున్నవారిని చూచెను. చెవులకు అతికిపోయినట్లున్న, వజ్రవైఢూర్యములతో కూడిన సువర్ణ కుండలములను ధరించిన, బాహుపురులు గల వారిని కూడా చూచెను. అప్పుడు చంద్రునితో సమానమైన ముఖములు కల రావణ స్త్రీలతో, మనోహరములైన కుండలములు ధరించిన రావణ స్త్రీలతో, ఆ విమానము తారగణములతో ప్రకాశిస్తున్న ఆకాశము వలె ప్రకాశించు చుండెను.

మదన వ్యాయాయములతో ఖిన్నులైన, సన్నని నడుము కల ఆ రాక్షసేంద్రుని వనితలు తమతమ అవకాశము ఉన్నచోటులలో నిద్రపోయిరి. అందులో ఒక వరవర్ణిని, నృత్యశాలిని, కోమలమైన అంగములతో అలాగే నృత్య భంగిమలో శయనించుయున్నది. సుందరమైన అంగములు కల, శుభకరమైన స్తనములు కల, చిరకాలము రమణించిన, ఒక భామిని పటహము అను వాద్యమును గట్టిగా కౌగిలించికొని నిద్రపోయెను. ఇంకొక కమలములవంటి కళ్ళు గల వనిత వేణువును గాఢముగా కౌగలించుకొని రహస్యముగా ప్రియతమతో కలిసిన కామినివలే నిద్రపోయెను.

ఇంకొక నృత్యశాలిని ఒక విపంచి అనబడు ఏడు తంత్రుల వీణను హృదయమునకు హత్తుకొని నిద్రావస్థలో కాంతుని పోందిన స్త్రీవలె నిద్ర పోయెను. ఇంకొక మత్తలోచన బంగారు వర్ణముకల మృదువైన మనోహరమైన అవయవాలతో ఒక మృదంగమును గట్టిగా కౌగలించుకొని నిద్రించెను. అనింద్యమైన కృశోదరము కల, మదనకార్యముల శ్రమతోఅలసిపోయిన ఒక వనిత పణవమనే వాద్యాని బాహువులతో ధృఢముగా హత్తుకొనుచూ నిద్రపోయెను. మరొక వనిత డిండిమము అనబడే వాద్యమును పట్టుకొని ఇంకొక డిండిమమును కౌగలించుకొని నిద్రపోతూ , ప్రియుని కౌగలించుకుంటూ ఇంకో చేతులో శిశువును ఎత్తుకున్న స్త్రీవలె నుండెను.

ఒక కమలపత్రాక్షి ఆడంబరమను వాద్యమును భుజములతో కౌగలించుకొని మదమోహితయై నిద్రపోతున్నది. నిద్రలో కలశమును తన్ని ఆ నీటితో తడిసిన ఒక భామిని వసంతఋతువులో నీటితో తడపబడిన పుష్పమాల లాగ వుండెను. ఇంకొక వనిత బంగారు కలశములను పోలిన తన కుచద్వయము ను హత్తుకొని నిద్రాబలముచేత పరాజిత అయి నిద్రపోవుచున్నది. ఇంకొక కమలపత్రాక్షి పూర్ణచంద్రుని తో సదృశమైన వదనము కలది, మత్తుతో ఇంకొక అందమైన సుశ్రోణీ అగు వనితను కౌగలించుకొని నిద్రించుచున్నది. కొందరు వరస్త్రీలు కామనిలు కాముకలను కౌగలించుకున్నట్లు విచిత్రమైన వాద్యములను కౌగలించుకొని, అక్కడ నిద్రపోతున్నారు.

అప్పుడు ఆ వానరుడు వారిలో ఏకాంతముగా శుభమైన శయనములో శయనించుచున్న రూపసంపన్నముగల ఒక స్త్రీని చూచెను

ఆమె బంగారుమణులతో కూడిన ఆభరణములతో విభూషితమైనది. తన కాంతులతో ఆ ఉత్తమమైన భవనమునకు అందము చేకూర్చుచున్నదా అన్నట్లు ఉన్నది. బంగారు వర్ణము కల, అంతఃపురమునకు రాణి అయిన, అందమైన రూపము గల, గాఢ నిద్రలో ఉన్నఆమె మండోదరి రావణుని ముఖ్యపట్టపురాణి. అలాగ రావణునికి ఇష్టమైన మండొదరిని హనుమంతుడు అక్కడ చూచెను.

అ మహాబాహువులు కల ఆ మారుతాత్మజుడు ఆభరణములతో భూషితమైన, రూపసంపన్నము కల ఆమెను చూచి 'ఈమె సీతయా ' అని భావించి మహత్తరమైన ఆనందముతో ఉప్పొంగి పోయెను.

ఆ సంతోషముతో జబ్బలు చరుచుకుంటూ తోకను ముద్దెట్టుకుంటూ ఆట పాటలతో స్తంభములను ఎక్కుతూ క్రిందకు దూకుతూ వానరులకు స్వాబావికమైన ప్రకృతిని హనుమంతుడు ప్రదర్శించెను.

ఆ విధముగా వాల్మీకి రామాయణములోని సుందరకాండలో పదవ సర్గ సమాప్తము.

తత్త్వ దీపిక:

మనసు నందలి వాసనలు లేదా చిత్త వృత్తులు మూడు దశలు కలిగియుండును.
(1) సుప్త దశ (2) క్షీణ దశ (3) ఉద్బుద్ధ దశ అని.
ఒకప్పుడు అవి నిద్రించు చుండును.ఆ నిద్రలో వాని శక్తి బయటకు ప్రసరింపదు
నిద్రించువాడు ఎంత క్రూరుడైననూ నిద్రలో క్రూరములగు వ్యాపారములను చేయడు.్
ఒకప్పుడు అసుర రాక్షసములైన చిత్తవృత్తులు అణగియుండును. ఒకప్పుడు బాగుగా తగ్గి కృశింఛినట్లు వుండును.
కోపము బాగుగా తగ్గినప్పుడు లేదన్నట్లు ఉండును.
కాని చిన్న కణమువలె నున్న నిప్పుపై కొద్దిగా ఊక వేసి రాజబెట్టినచో మరల ఏట్లు అది ప్రజ్వరిల్లునో అదే విధముగా కృశించిన కామక్రోధాదులు కూడా అనుభవింపదగిన విషయములు లభించినచో మరల విజృంభించును.

కావున మనో విత్తులు నిద్రాణములై ఉన్నదశలో అన్వేషణ సాగింపవలెను. రాజస తామసములగు భావనలు ప్రకృతివశమున తగ్గియున్నప్పుడే అన్వేషణ సాగించవలెనని దీని చే సూచింపబడినది.

అట్టి దశలో కూడా దానిని జయింపశక్తి కలవానికి కూడా మనసు భయమునే కలిగించును.
అందుకనే శత్రుకర్షణుడైన హనుమంతుడు వేయిమంది రావణులను చంపగల హనుమంతుడు నిద్రలో వున్న రావణుని చూచి భయపడి ఒక అడుగు వెనకవేశెను అని వర్ణిస్తాడు వాల్మీకి.

అలాగే ఆత్మ అన్వేషణలో కూడా రాజస తామస ప్రకృతులు అణగబడియున్నప్పుడే ఆ అత్మాన్వేషణ ముందుకు సాగుతుంది.

అన్వేషణ లో బాహ్యసౌందర్యము విషయభోగము ఎంత ఆకర్షించునో, దానిని తట్టుకొని అత్మాన్వేషన సాగుట ఎంతకష్టమో , ఇంద్రియార్థములు ఇంద్రియములను ఎంత బలాత్కరించునో ఇచట మనకు కనపడును.

హనుమంతుని అన్వేషణలో లోకోత్తరమగు సౌందర్యము కల భవనములు, శిల్పములు, స్త్రీలు, మధురములగు భక్ష్యములు, పానములు కనపడును. అది అంతా చూసి, "స్వర్గోయం దేవలోకోయమ్.." అనుకుంటాడు హనుమ. వానిని అన్నింటినీ చూచుచూ వాటివేపు మనసు పోకుండా సీతాన్వేషణ సాగుచుండును. దీని మనకి తెలియచేయుటకా అన్నట్లు లంకాసౌందర్యము ఇక్కడ చాలా అధికముగా వాల్మీకి వర్ణించెను.

బాలకాండలో అయోధ్యాపురవర్ణన వుంది. సుందరకాండలో లంకానగర వర్ణన వుంది. అయోధ్యాపురవర్ణనకు లంకాపుర వర్ణనకు భేదము కనిపిస్తుంది.

అయోధ్యాపురవర్ణనలో పట్టణవర్ణ కన్న ప్రజల వర్ణన అధికముగా కనిపించును. ' నాకుండలీ నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్' అంటూ వారి సంపదను, "ననాస్తికః నచానృతకథః నావిద్వాన్ నా బహుశ్రుతః" అంటూ వారి గుణసంపదను వర్ణించును.

లంకావర్ణనలో భవన యౌవ్వన వర్ణన. ఇది బాహ్యాభ్యుదయము. దీని యందు ఆసక్తి కలిగియుండుటయే ఆత్మబంధ హేతువు.దీని యందు దృష్టి మరలక ఆత్మయందే ఏకాగ్రచిత్తము కలవాడు మాత్రమే అత్మ దర్శనము చేయగలడు.

ఈ రహస్యమును మనకి హనుమంతుని సీతాన్వేషణ మనకు సూచిస్తుంది.

ఇంక ముందుకు పోయి పానుపై పైకి చేతులు చాచుకు పడుకొని ఉన్న రావణుని చేతులను వాల్మీకి ఎంతో వర్ణించును.

ఆబాహువులు మందరపర్వతములో పగపట్తి పరున్న పాములవలె ఉన్నవట. సర్వకర్మలకు మూలము బాహువులు. కర్మలే మనను బంధించునవి. అట్లు బంధ హేతువులగు బాహువులను చూచి హనుమ అశ్చర్యముతో మనకు వర్ణిస్తాడు. కామపూరితమైన మనసుయొక్క ప్రేరణ చేసెడి కర్మలను బంధహేతువులుగా గుర్తింపపవలె నని రావన బాహువుల వర్ణన చేయబడినది.

ఈ భుజముల వర్ణలలో "భుజౌ" అంటూ రెండు భుజములని మనకి సూచిస్తాడు. అలాగే మకూతము గురించి చెఔతూ ఒకటే శిరస్సు లాగా వర్ణన చేయబడినది. పది తలలు ఇరవైచేతులు గల రావణుమి ఇలా ఎలా వర్ణింపబడడమైనది అని మనకు ఆశ్చర్యము రావచ్చు.

రావణుడు కామరూపి..కామరూపి కనక యుద్ధములోనూ వెలుపల తిరుగునప్పుడు పది తలలతోనూ, ప్రియురాండ్రతో కలిసి రమించునపుడు ఒక శిరస్సుతోనూ ఉంటాడని మనము భావించ వచ్చు.

కానికి దీనికి వేరొక అర్ధము ఉంది.
రావణుడు మనస్సు.పది ఇంద్రియములు.పది ముఖములు.
నిద్రించునపుడు ఇంద్రియవ్యాపారములు విరమించును. మనసు మాత్రమే పనిచేయుచుండును. అందుచే పది తలలు ఉండవు.ఇరువది చేతులూ ఉండవు.మరల లేచినపుడి ఇంద్రియములు తమతమ వ్యాపారములను ఆరంభించును.అందుచే పది తలలు లేచును. మను పండులున్నప్పుడు కన్ను చూడదు. చెవి వినదు.కాని లేచుసరికి మాటలు వినిపించును.వాసనలు వచ్చుచుండును.అందుచే ఇంద్రియములు లేచును.
ఇట్లు ఇంద్రియవ్యాపారములు తగ్గినప్పుడు హనుమ సీతాన్వేషణ చేయుచున్నాడు.

ఆ సీతాన్వేషణలో అంతఃపురస్త్రీలలో ప్రధానురాలగు మండోదరిని చూచెను.
రూపము యౌవ్వనము సీతలాగే ఉండెను. మండోదరికూడా సీతమ్మవలెనే అందకత్తె. యౌవ్వనవతి. హనుమ సీతమ్మ అనుకొనుటకు ఆ రూపము యౌవ్వనమే కారణము. గుణములబట్టి చూచినచో ఆమె సీతమ్మకు ఈడుకాదు. తాత్కాలికముగా హనుమంతునికి ఈ ఆలోచన తట్టలేదు. అవిడ సీతయే అనుకొని మహదానందము పడతాడు.

నిండుదనము లేని పసివారికి ఏదైన హర్షకాలము కలిగినచో ఏట్లెగిరి గంతులు వేయుదురో అట్లే హనుమంతుడు కూడా ఎగిరి గంతులు వేసెను.ఆ గంతులే ఇది పూర్ణమైన స్థితి కాదని కపిచేష్టితమని సూచించుచూ "నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం" అంటాడు కవి.

కపి ప్రవృత్తిని ప్రదర్శించెను అని అంటాడు.
పిల్లలకు ఏదైనా ఉత్సాహము కలిగినచో గంతులు వేయుదురు. వారి ఆనందము క్రియలచేతనే ఎక్కువగా ఆవిష్కృతము అగును. అదేవిషయము సూచించుటకు కవి ఇక్కడ చాలా క్రియా పదములను ఉపయోగించెను. చూడబడినది నిజమైన సీతకాదని అతని చేష్టలచేతనే మనకి స్ఫురింపచేయుచూ చివరికి ఇది కపి ప్రవృతి అని పేర్కొనెను.

కేవలము శాస్త్రములలో చదివి ఊహించి
(౧) దర్శించినట్లు అనుభవించుట (౨) ప్రత్యక్షముగా దర్శించుట అను ఈరెండిటికీ భేదమును మండోదరీ దర్శనమున సీతాదర్శనమున మనకు కనపడును. అది అనుభవమునకు అనుభూతికి ఉన్న తేడా.
సీతవలెనున్న మండోదరి చూచినప్పుడు హర్షముతో గంతులు పాటలు వచ్చెను. హర్షము అనుభవించెను.
నిజముగా సీతను చూచినపుడు "భాష్పపర్యాకులేక్షణః", అంటే కన్నీటితో నిండిన కనులు గలవాడై విచారించుచూ మాటాడక యుండిపోయెను.
తుమ్మెద పూవు చుట్టు తిరుగునంతసేపు ధ్వని చేయును. పూవుపై వ్రాలి మకరందము నాస్వాదించునపుడు మౌనమే తప్ప ధ్వని చేయదు.
అట్లే ఆత్మానుభవము గాని భగవదనుభము కాని పొందువారు కంఠము గద్గదమై ఒడలు గగుర్పొరచి తన్మయములో ఉందురుకాని బాహ్యముగా చేష్టలతో ఆనందమును ఆవిష్కరింపరు.

ఇది మనకు తెలియపరచేది ఇచటి దర్శనము సీతాదర్శనము కాదు అని.

||ఓమ్ తత్ సత్||

అస్ఫోటయామాస చుచుంబ పుచ్ఛం
ననంద చిక్రీడ జగౌ జగామ|
స్తంభాన్ ఆరోహాన్ నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం||55||

స|| ఆస్ఫోటయామాస పుచ్ఛమ్ చుచుంబ చిక్రీడ జగౌ జగామ స్వామ్ కపీణాం ప్రకృతీం నిదర్శయన్ స్తంభాన్ ఆరోహన్ నిపపాత||

( ఆ సంతోషముతో) జబ్బలు చరుచుకుంటూ తోకను ముద్దెట్టుకుంటూ ఆటపాటలతో స్తంభములను ఎక్కుతూ క్రిందకు దూకుతూ వానరులకు స్వాబావికమైన ప్రకృతిని ప్రదర్శించెను.

||ఓమ్ తత్ సత్||